ఉప ఎన్నిక ఫ‌లితం... దేనికి సంకేతం? (Will Nandyal result reflects in 2019)

ఉప ఎన్నిక ఫ‌లితం… దేనికి సంకేతం? (Will Nandyal result reflects in 2019)

ఉప ఎన్నిక ఫ‌లితం… దేనికి సంకేతం? (Will Nandyal result reflects in 2019)

ఉప ఎన్నిక ఫ‌లితం… దేనికి సంకేతం?

(రియ‌ల్ న్యూస్ – నంద్యాల‌)

ఉప ఎన్నిక ఫ‌లితం టీడీపీకి అనుకూలంగా రావ‌డంతో…ఇక 2019 లోనూ త‌మ‌దే విజ‌య‌మ‌ని ఆ పార్టీ నేత‌లు ప్ర‌క‌టిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్రంలోని తెలుగుదేశం పాల‌న‌కు రెఫ‌రెండం అని భావిస్తున్నారు. ప్ర‌భుత్వానికి రాష్ట్ర ప్ర‌జ‌లిచ్చిన కితాబుగా అభివ‌ర్ణిస్తున్నారు. అయితే, నిజంగానే నంద్యాల ఫ‌లితం…2019లోనూ ప్ర‌తిబింబించ‌నుందా? ఉప ఎన్నిక ఫ‌లితం దేనికి సంకేతం?

సాధార‌ణంగా ఏ ఉప ఎన్నిక అయినా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంద‌నేది ప్రాధ‌మిక సూత్రం. ప్ర‌భుత్వంలో ఉంటూ, పాల‌న‌తో ప్ర‌భావితం చేయ‌గ‌లిగిన ప‌రిస్థితిలో ఉంటారు కాబ‌ట్టి…అధికార పార్టీ నేత‌లే విజేత‌లుగా నిల‌వ‌డం స‌ర్వ‌సాధార‌ణం. నంద్యాల‌లోనూ ఇపుడు అదే జ‌రిగింది. కానీ, ప్ర‌చార హోరు, ఎన్నిక తీరు హోరాహోరీగా నువ్వా, నేనా అన్న‌ట్లు సాగ‌డంతో నంద్యాల ముఖ‌చిత్రం విశేష ప్రాముఖ్యాన్ని సంత‌రించుకుంది. ఈ ఎన్నిక‌లో వైసీపీ పొర‌పాటున గెలిస్తే… రాష్ట్రంలో టీడీపీ ప్ర‌భుత్వానికే ముప్పు క‌లుగుతుంద‌న్నంత‌గా అధినాయ‌క‌త్వం ఈ ఒక్క ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకోవ‌డం రాజ‌కీయ ఉద్రిక్తత‌కు దారితీసింది. దీనికి తోడు… ఇదిగో పులి అంటే అదిగో తోక‌…అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తూ… స‌హ‌జంగానే ప్ర‌తి అంశాన్నిరాజ‌కీయం చేసే వైసీపీ నాయ‌క‌త్వానికి…నంద్యాల ఉప ఎన్నిక‌, కోతికి కొబ్బ‌రికాయ దొరికిన‌ట్ల‌యింది.

అంతా ర‌చ్చ రచ్చ‌… ఎక్క‌డుందీ పాల‌న‌పై చ‌ర్చ‌?babu vs jagan

ఉప ఎన్నిక‌లంటే..ఎంతో హుందాగా సాగాలి… ప్ర‌స్తుతం పాల‌న‌లో ఉన్న ప్ర‌భుత్వం చేస్తున్న మంచి ప‌నులు, వైఫ‌ల్యాల‌పై స‌ద్ విమ‌ర్శ‌లు, చ‌ర్చ‌లు జ‌ర‌గాలి. అభివృద్ధి చెందిన దేశాల‌లో అయితే ఇలాగే బిగ్ డిబేట్ జ‌రుగుతుంది. కానీ, మ‌న ద‌గ్గ‌ర మాత్రం అంతా ఊర మాసే… ఒక‌రిని ఒక‌రు చెడ తిట్లు తిట్టుకోవ‌డం, ఓట‌ర్ల‌ను సంత‌ల్లో ప‌శువుల‌ను కొన్న‌ట్లు కొనుక్కోవ‌డం, కుద‌ర‌క‌పోతే ఓట‌ర్ల‌ను భ‌య‌భ్రాంతుల్ని చేయ‌డం…అంతా ఫ‌క్త్ అరాజ‌కీయ‌మే త‌ప్ప‌, ప్ర‌జాస్వామ్య ల‌క్ష‌ణాలు ప‌రిర‌క్షించే ల‌క్ష‌ణాలేవీ మ‌న పార్టీల‌కు లేన‌ట్లుంది. ఉంటే… ఈ నంద్యాల ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌న రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై, ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల‌పై, కొత్త రాష్ట్రం అభివృద్ధికి అవ‌కాశాల‌పై చ‌ర్చించి ఉండేవారు. ఇవేమీ మ‌చ్చుకైనా క‌నిపించ‌ని నంద్యాల ఎన్నిక‌లు, జ‌గ‌న్ వ‌ర్సెస్ చంద్ర‌బాబు లాగే సాగింది. నిత్యం జ‌గ‌న్ సీఎం చంద్ర‌బాబును కాల్చినా, కొట్టినా త‌ప్పులేదు… వంటి అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ, తెలుగుదేశం అనుకూల ప‌త్రిక‌ల్లోనూ ప‌తాక శీర్షిక‌ల్లోకి ఎక్కే ప్ర‌య‌త్నం చేశారు. ఇక అధికార పార్టీ నేత‌లు, మంత్రులంతా జ‌గ‌న్, రోజా వ్యాఖ్య‌ల‌కు దీటుగా స్పందించే ప‌నిలోనే బిజీ అయ్యారు. ఎక్క‌డా స‌ద్విమ‌ర్శ‌లు, రాష్ట్రాభివృద్దిపై చ‌ర్చ‌లు లేవు. ఇక ఎన్నిక‌ల్లో ధ‌న ప్ర‌వాహం, ఓట‌ర్ల ప్ర‌లోభాల‌కు అడ్డే లేదు. ఈ త‌ర‌హా మ‌న మార్కు ఎన్నిక‌ల్లో ఎట్ట‌కేల‌కు టీడీపీ అనూహ్యంగా గౌర‌వ‌ప్ర‌ద‌మైన మెజారిటీతో విజ‌యం సాధించింది.
కానీ, ఇదే 2019 ఎన్నిక‌ల్లో కొన‌సాగుతుంద‌ని కొంద‌రు టీడీపీ నేత‌లు భావించ‌డం ఆత్మ‌హ‌త్యా స‌దృశం కాగ‌ల‌దు. ఎందుకంటే, ఈ ఉప ఎన్నిక‌లో గట్టెక్కేందుకు టీడీపీ కింద మీదా ప‌డాల్సి వ‌చ్చింది. త‌మ శ‌క్తి యుక్తుల‌ను సంపూర్ణంగా ఒడ్డాల్సి వ‌చ్చింది. 2019 ఎన్నిక‌ల్లోనూ ఇలాగే క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుందా? నువ్వా, నేనా అన్న‌ట్లు త‌ల‌పడాల్సిన ప‌రిస్థితి టీడీపికి త‌ప్ప‌దా? ఇదే విష‌యాన్ని ఆ పార్టీ నాయ‌కులు త‌మ వ్యాఖ్య‌ల ద్వారా క‌న్ఫ‌మ్ చేస్తున్నారా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. వైసీపీ నాయ‌కుల్ని, ఎమ్మెల్యేల‌ను వ‌రుస‌పెట్టి త‌మ పార్టీలోకి క‌లుపుకొన్న టీడీపీ, ఇంకా వైసీపీని ఓడించ‌డానికి ఇంత‌గా శ్ర‌మించాల్సి రావ‌డం, న‌వ్యాంధ్ర‌లో త‌మ మూడున్న‌రేళ్ళ పాల‌న‌లో వెన‌కంజ కాదా అనేది గ‌మ‌నార్హం.

Author Biography:

Leave a Reply

Translate »